27-October-2018-NewsClips
శనివారం, అక్టోబర్ 27, 2018
పాలు, చేపలు, రొయ్యల ఉత్పత్తిలోనూ కృష్ణాజిల్లా టాప్
అభినందించిన సీఎం చంద్రబాబు
ఈనాడు, అమరావతి

జిల్లాలో పన్నుల వసూలలో గణనీయమైన అభివృద్ధి సాధించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. విశాఖపట్నం జిల్లాను దాటి పన్నులు వసూలు కావడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వెల్లడించారు. వివిధ అంశాల్లో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించింది. రెండో రోజుల కలెక్టర్ల సదస్సులో పన్నుల వసూలు, ఇతర అంశాలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ బి.లక్ష్మీకాంతంను సీఎం అభినందించారు. సెప్టెంబరు 18 నాటికి వాణిజ్య పన్నుల వసూలు రూ.7971.75 కోట్లు వసూలు అయ్యాయి. విశాఖపట్నం జిల్లా రూ.7వేల కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. రెండో స్థానంలో ఆ జిల్లా నిలిచింది. ఎక్సైజ్ ద్వారా రూ.310 కోట్లు, రిజిస్ట్రేషన్ల ద్వారా 322.61కోట్లు, రవాణా శాఖ ద్వారా 232.65 కోట్లు, గనుల ద్వారా రూ.70 కోట్లు ఆదాయం వచ్చింది. జిల్లాలో మొత్తం 8922.93 కోట్లు వసూలు చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ వివరించారు.
* జిల్లాలో మీసేవా ద్వారా 92.26లక్షల అర్జీలు స్వీకరించగా పరిష్కారంలోనూ ముందంజలో ఉంది. ఏ కేటగిరి కింద రూ.39.18 లక్షలు, బీకేటగిరి కింద రూ.53.08లక్షలు అందాయి. గడువులోగా పరిష్కరించి చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. వీటిలోనూ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
* అవెన్యూ బ్లాక్, మడ మొక్కల పెంపకంలోనూ జిల్లా 170 ఎకరాలు లక్ష్యంకాగా 280 ఎకరాల్లో పెంచి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది.
* పాల ఉత్పత్తిలో కృష్ణా జిల్లా టాప్‌లో నిలవడం పట్ల సీఎం అభినందించారు. 2018-19లో 18.8 ఎంల్‌ఎంటీ కాగా సెప్టెంబరు నాటికే 8.8 ఎంఎల్‌టీ సాధించి 17.18శాతం వృద్ధి రేటుతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది.
* చేపలు, రొయ్యల ఉత్పత్తిలోనూ కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉంది. జీవీఏ లక్ష్యం 16693ల టన్నుల లక్ష్యంకాగా రెండో త్రైమాసికం నాటికి 10179 టన్నుల ఉత్పత్తి చేయడం జరిగింది. రొయ్యలు, చేపల ఉత్పత్తి జీవీఏలో రాష్ట్రంలోనూ మొదటి స్థానంలో నిలిచింది.
* భూవివాదాల పరిష్కారంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ప్రైవేటు భూములకు సంబంధించి 1047429 వివాదాలకు గాను 93.14 శాతం పరిష్కరించి అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వ భూముల వివాదాలు 248660కు గాను 90శాతం పరిష్కారమయ్యాయి.
* 39 గోకులాలకు 42 ఏర్పాటు చేశారు. పలు విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచింది.
ప్రాథమిక రంగంపై దృష్టి..!
పలు విభాగాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం సంతోషకరమని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వ్యాఖ్యానించారు. పన్నుల వసూళ్లలో జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని, ఇది అధికారుల సమష్టి కృషిగా పేర్కొన్నారు. కొన్ని శాఖలు లక్ష్యం దగ్గరగా ఉన్నాయని, వాటిని సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో పలు అంశాలు చర్చకు వచ్చాయని, అన్నింటిలోనూ కృష్ణా జిల్లా పనితీరు బాగుందని సీఎం ప్రశంసించారని చెప్పారు. ఆరోగ్య శాఖకు సంబంధించి మాతా శిశు మరణాల రేటు బాగా తగ్గిందని వివరించారు. రక్తహీనత ఎక్కువగా ఉండేదని, వివిధ చర్యల వల్ల వాటిని తగ్గించామని చెప్పారు. ఇదే ప్రోత్సాహంతో ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు.
నాలుగేళ్లలో పాతాళం నుంచి ఆకాశంలోకి…
విదేశాలకు వెళ్లే చారిత్రక రోజు వచ్చేసింది
సింగపూర్‌కు టిక్కెట్ల విక్రయం ఆరంభం
ఈనాడు, అమరావతి

గన్నవరం విమానాశ్రయం గత నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం.. గత నాలుగేళ్లలో 220శాతం ప్రయాణికుల వృద్ధిని గన్నవరం విమానాశ్రయం సాధించింది. నాలుగేళ్ల కిందటి వరకూ కేవలం హైదరాబాద్, ఇంకో నగరానికి మాత్రమే వెళ్లేందుకు విమాన సర్వీసులు అందుబాటులో ఉండేవి. కానీ.. ప్రస్తుతం దేశంలోని ఎనిమిది నగరాలకు వెళ్లేందుకు ప్రతి పావుగంటకో విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. అన్నింటికంటే ప్రధానంగా అంతర్జాతీయ సర్వీసులు డిసెంబర్ 4న తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు గన్నవరం నుంచి గాలిలోకి లేవబోతోంది. దశాబ్దాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయిన గన్నవరం.. కేవలం నాలుగేళ్లలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది. గన్నవరంలో అడుగుపెడితే.. నేరుగా సింగపూర్‌లో దిగే చారిత్రక ఘట్టం కూడా త్వరలో ఆవిష్కృతం కాబోతోంది. దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయం కూడా శుక్రవారం నుంచి ఆరంభమైంది.

ఏడాదిన్నర కిందట గన్నవరం విమానాశ్రయానికి కేంద్రం అంతర్జాతీయ హోదాను కల్పించింది. ఆరు నెలల్లో అంతర్జాతీయ సర్వీసులు గాలిలోకి లేస్తాయని ప్రకటించారు. కానీ.. అనేక ఆటంకాలను దాటి ఇన్నాళ్లకు అంతర్జాతీయ కలను సాకారం చేసుకునే రోజొచ్చింది. ఈనెల 25నే సింగపూర్‌కు తొలి సర్వీసును నడపాలని అధికారులు భావించినా.. కస్టమ్స్ అనుమతుల జాప్యంతో వాయిదా పడింది. డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేశారు. కానీ.. ఈ తేదీని కూడా ఎంతవరకూ నమ్మొచ్చనే అనుమానాలు అందరిలో కలిగాయి. వాటన్నింటినీ తొలగిస్తూ.. ఇండిగో తన తొలి అంతర్జాతీయ విమాన సర్వీసుకు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాన్ని ఆరంభించింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు నాలుగున్నర గంటల్లో చేరిపోయేలా శీతాకాల షెడ్యూల్‌ను ఇండిగో ప్రకటించింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు వెళ్లేందుకు, అటు నుంచి వచ్చేందుకు వారంలో రెండు రోజులు అక్కడ, ఇక్కడ అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోనికి వచ్చాయి. రూ.18వేల లోపే సింగపూర్‌కు వెళ్లి వచ్చేందుకు టిక్కెట్ ధరలు అందుబాటులో ఉన్నాయి.గణనీయమైన ప్రయాణికుల వృద్ధి..
గన్నవరం విమానాశ్రయంలో ఏటేటా ప్రయాణికుల వృద్ధి దేశంలోనే మరెక్కడా కానరానిది. 2014 నుంచి ఇప్పటివరకూ 220శాతం ప్రయాణికులు పెరిగారు. సర్వీసులు సైతం దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ వచ్చాయి. కార్గో సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అంతర్జాతీయ సర్వీసులూ ప్రారంభమవుతున్నాయి. సింగపూర్‌తో పాటూ దుబాయ్‌కు సైతం సర్వీసులను ఆరంభిస్తే.. ఇంక ప్రపంచంలోని ఏ మూలకైనా ఇక్కడి నుంచి వెళ్లిపోయే అనుసంధానం వస్తుందని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహా పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య సంఘాలు కోరుతున్నాయి. 2014-15లో 2.31 లక్షల మంది ప్రయాణికులు గన్నవరం నుంచి రాకపోకలు సాగించారు. 2015 తర్వాత ప్రయాణికుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది.