27-March-2019-NewsClips





స్థానిక ఆలయాల అభివృద్ధి పనులపై సమీక్ష
జేఈవో లక్ష్మీకాంతం
తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తితిదే స్ధానికాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిపై తితిదే తిరుపతి జేఈవో లక్ష్మీకాంతం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులు వేచి ఉండేందుకు వీలుగా పాత అన్నదానం భవనంలో కుర్చీలు, ఫ్యాన్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రాంతాల్లో ఏకరూప సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. స్టోర్ గదిని మార్చాలని, డిస్పెన్సరీ, ప్రచురణల విక్రయశాల, పాదరక్షల కౌంటర్లను మార్చాలని, ఏఆర్టీ కోసం శుక్రవారపుతోటలో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పద్మావతి నిలయం వద్ద భక్తులకు కనిపించేలా పెద్ద సైజులో బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీ కోదండరామాలయం వద్ద భక్తులను ఆకట్టుకునేలా పలు అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో తితిదే న్యాయాధికారి రమణనాయుడు, సీఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఈ1 రమేష్‌రెడ్డి, డీప్యూటీ ఈవోలు గౌతమి, వరలక్ష్మి, ఝాన్సీరాణి, వీజీవో అశోక్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.