తిరుపతి, 2019 మార్చి 15 : ”భక్తులతో భవదీయుడు”
టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
శనివారం, మార్చి 16, 2019
భక్తుల అభిప్రాయాలకు పెద్దపీట: జేఈవో
మాట్లాడుతున్న జేఈవో లక్ష్మీకాంతం
తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తితిదే తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం శుక్రవారం ప్రారంభించిన ‘భక్తులతో భవదీయుడు’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం అనంతరం జేఈవో పరిపాలనా భవనంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భక్తుల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తూ మెరుగైన సౌకర్యాలు కల్పించడమే భక్తులతో భవదీయుడు ముఖ్య ఉద్దేశమన్నారు. తొలిసారి నిర్వహించిన ఈ కార్యక్రమానికి తిరుపతి, విజయవాడ నుంచే కాకుండా అమెరికా నుంచి కూడా ఫోన్లు వచ్చాయన్నారు. ప్రతినెల మూడో శుక్రవారం ఉదయం 8.30నుంచి 9.30గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. తితిదే స్థానికాలయాల్లో ఆభరణాల భద్రతకు ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీ వినియోగిస్తామన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్ల విష్ణునివాసానికి ఐఎస్‌వో గుర్తింపు లభించిందని.. అలాగే తితిదే విద్యాసంస్థల్లోనూ నైపుణ్యంతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నామని.. డిగ్రీ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది తితిదే విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు ఆటోమెటిక్ సిస్టమ్ ట్రైల్ తనిఖీ చేయనున్నామన్నారు. ‘యాత్ర సంపూర్ణం’ పేరుతో తిరుపతిలోని గోవిందరాజస్వామి వారిని దర్శించుకుని, తిరుమలలోని భూవరాహాస్వామి దర్శనం, శ్రీవారిని దర్శించుకున్న తరువాత తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు స్థానికాలయాలను దర్శించుకునేలా భక్తులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. తితిదే స్థానికాలయాల్లో రిజిస్ట్రార్లు పక్కాగా నిర్వహించాలని, ఆభరణాల తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
భక్తుల వేదిక ఏర్పాటు
తితిదే పరిపాలనా భవనంలో భక్తుల వేదికను ఏర్పాటు చేసి రోజులో ఒక సమయం అధికారులతో పాటు వెళ్లి భక్తుల సమస్యలను తెలుసుకుంటామన్నారు. తిరుచానూరు అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ అమలు చేయనున్నామన్నారు. ఆలయం వద్ద ఉన్న శుక్రవారపుతోటలో పద్మావతి పరిణయం, శ్రీనివాస కల్యాణం వృత్తాంతం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. తితిదే ఏర్పాటు చేసే యాప్ ద్వారా ఆయా బొమ్మలపై నొక్కితే అవే సమాచారం చెప్పేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. గోవిందరాజస్వామి వారి పుష్కరిణిలో 20నిమిషాల పాటు లేజర్ షో ఏర్పాటు చేస్తామన్నారు. తితిదే కాల్ సెంటర్‌కు వచ్చే కాల్‌కు పూర్తిస్థాయిలో సమాచారం అందించాలని, భక్తుల వినతులు సంబంధింత అధికారులకు పంపి పరిష్కారం అయ్యాక తిరిగి భక్తులకు తెలియజేయాలని ఆదేశించామన్నారు. మార్చి 20, 21 తేదీల్లో తితిదేలోని వివిధ సంఘాల వారితో మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుంటామన్నారు. తితిదే ఉద్యోగులకు శాస్త్రీయ నృత్యాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒంటిమిట్ట ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా రాములవారి కల్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్టు చేపట్టినట్లు తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
తిరుపతి సంపూర్ణ యాత్రలో భాగంగా తొలుత తిరుమలలో శ్రీ వరాహాస్వామి, శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శిస్తేనే యాత్ర సంపూర్ణం అవుతుందని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అన్నారు. ”భక్తులతో భవదీయుడు” కార్యక్రమం తిరుపతి టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగింది.
అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి నెల మూడో శుక్రవారం ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు టిటిడి అనుబంధ ఆలయాలు, ధార్మిక కార్యక్రమాలపై భక్తుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలిపారు.
టిటిడి విద్యా సంస్థలలోని విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యంతో కూడిన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. తిరుచానూరు అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులు టిటిడి అనుబంధ ఆలయాలైన శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నారాయణవనం, నాగలాపురం ఆలయాలను దర్శించుకోవాలని కోరారు.
తిరుచానూరులోని ఫ్రైడే గార్డెన్స్‌లో పద్మావతి పరిణయం, శ్రీనివాస కల్యాణం వృత్తాంతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో 20 నిమిషాలపాటు లేజర్ షో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
టిటిడి అనుబంధ ఆలయాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను బ్రహ్మత్సవాలలోపు వేగంగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా టిటిడి కాల్‌సెంటర్ ద్వారా భక్తులకు అవసరమైన సమాచారం మరింత వేగవంతంగా అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామావారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాములువారి కల్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా భక్తులతో భవదీయుడు కార్యక్రమంలో పలువురు భక్తులు ఫోన్‌ఇన్ ద్వారా జెఈవోకు తెలియజేశారు. అందులో ముఖ్యంగా అమెరికాలోని డల్లాస్ నగరంకు చెందిన ఎన్‌ఆర్‌ఐ శ్రీ సత్యనారాయణ ”అమెరికాలో టిటిడి నిర్వహించిన వైెభవోత్సవాలు, శ్రీవారి కల్యాణోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ప్రవాస యువతలో ఆధ్యాత్మికత పెంచేందుకు శుభప్రధం వంటి కార్యక్రమాలను అమెరికాలో నిర్వహించాలని కోరారు. అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేద పారాయణం ఎస్వీబిసిలో ప్రత్యక్ష ప్రసారం” అందించాలని కోరారు.
దీనిపై జెఈవో మాట్లాడుతూ అమెరికాలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేద పారాయణం ప్రత్యక్ష ప్రసారంపై ఆగమ సలహాదారుతో చర్చిస్తామన్నారు.
తిరుపతికి చెందిన శ్రీ నవీన్‌కుమార్ రెడ్డి ”టిటిడి పంచాంగం క్యాలెండరు కొరకు దేశవిదేశాలలోని భక్తులు ఎదురుచూస్తున్నారు. దీనిని భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో టిటిడి నిర్మించిన డార్మీటరీ, 40 గదులు భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఇటీవల తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరిగిన బంగారు కిరీటాల కేసుపై త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయంను ఏ.పి.టూరిజం వారికి కేటాయించాలని టిటిడి నిర్ణయించినట్లు పత్రికలలో వచ్చింది. దీనిని టిటిడి నిర్వహించడం వల్ల భక్తులకు మెరుగైన సౌకర్యాలు” అందించవచ్చని సూచించారు.
జెఈవో స్పందిస్తూ త్వరలో భక్తులకు టిటిడి పంచాంగం క్యాలెండరు అందుబాటులోకి తీసుకువస్తాం. పెంచలకోనలో టిటిడి నిర్మించిన వసతి గృహాన్ని త్వరిత గతిన భక్తులకు అందుబాటులోనికి తీసుకువస్తాం. కిరీటాల కేసును పోలీస్‌లు దర్యాప్తు చేసున్నారు. టిటిడి అనుబంధ ఆలయాలలో భద్రాతను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. తిరుచానూరులోని పద్మావతి నిలయం అంశం ఈవో గారితో చర్చిస్తామన్నారు.
విజయవాడకు చెందిన శ్రీ నాగభూషణం ”దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలలో టిటిడి ఆధ్వర్యంలో విద్యా, వైద్య సేవలను” ఏర్పాటు చేయాలని కోరారు.
దీనిపై జెఈవో మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలలో దివ్వక్షేత్రాలు నిర్మిస్తున్నాం. అందులో భాగంగా ఇటీవల హైదరాబాదులో శ్రీవారి ఆలయన్ని భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చాం. ప్రతి జిల్లాలో టిటిడి విద్యా సంస్థలు, వైద్య శాలలు ఏర్పాటు చేసేందుకు గల అవకాశాన్ని పరిశీలిస్తాం. అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని వేదపాఠశాలలో వేద విద్యను బోధిస్తున్నాం అని చెప్పారు.
తిరుపతికి చెందిన శ్రీ జ్ఞానప్రకాష్ ”తిరుపతిలోని విష్ణునివాసం వసతి సమూదాయానికి ఐఎస్‌వో గుర్తింపు అందుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. అనంతరం దేశ విదేశాల నుండి విచ్చేసే భక్తులకు వారివారి బాషలలో సమాచారం తెలిపేందుకు అనువాదంతో కూడిన సాఫ్ట్‌వేెర్‌ను అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని కోరారు.
జెఈవో మాట్లాడుతూ దేశ విదేశాల నుండి విచ్చేసే భక్తులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన సేవలందిస్తున్నామన్నారు. వారికి అవసరమైన సమాచారంను ఐవోటి (ఇంటర్నెట్ అఫ్ థింగ్స్) మరియు ఐటి ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ సుబ్రమణ్యం, శ్రీమతి ఝాన్సీరాణి, శ్రీ శ్రీధర్, శ్రీమతి వరలక్ష్మీ, శ్రీ ధనంజయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



గురువారం, మార్చి 14, 2019
‘భక్తులతో భవదీయుడు’ నూతన కార్యక్రమం
తితిదేకి సంబంధించి సూచనలు, సమస్యల స్వీకరణ
రేపు నిర్వహణ: తితిదే తిరుపతి జేఈవో లక్ష్మీకాంతం
తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: భక్తుల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకునేందుకు.. సూచనలు, సలహాలు స్వీకరించేందుకు తితిదే తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘భక్తులతో భవదీయుడు’ పేరిట ఫోన్‌ఇన్ ఏర్పాటు చేసి భక్తుల వినతులకు ఆయన స్పందించనున్నారు. తితిదే తిరుపతి పరిధిలోని ఆలయాల అభివృద్ధికి, భక్తులకు అందుతున్న సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
* తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీ కోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం, నారాయణవనంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి వారి ఆలయం తదితర తితిదే స్థానికాలయాల గురించి సమాచారాన్ని, ఆయా ఆలయాల్లో నెలకొన్న సమస్యలను, తమ అభిప్రాయాలను భక్తులు ఈ కార్యక్రమం ద్వారా తెలపవచ్చు.
* తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం వసతి సముదాయాల్లోని సౌకర్యాలపై సూచనలు, సలహాలను ఈ కార్యక్రమంలో జేఈవో స్వీకరించనున్నారు.
ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహణ
‘భక్తులతో భవదీయుడు’ కార్యక్రమం తొలిసారిగా ఈనెల 15న జరగనుంది. ప్రతినెల మూడో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 8.30నుంచి 9.30గంటల వరకు తితిదే తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం అందుబాటులో ఉంటారు. భక్తులు ఫోన్ ద్వారా 0877-2234777, నేరుగా కాని సంప్రదించవచ్చు. తితిదేలో జరుగుతున్న అనేక అంశాలపై జేఈవో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశాలపై ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది.