Tirumala Tirupati Devasthanam
Sri Venkateswara Swamy Temple
Jubilee Hills Hyderabad

జూబ్లీ కొండల్లో ఆధ్యాత్మిక వైభవం
ఫిలింనగర్, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌లో ఆధ్యాత్మిక సుగంధం పరిమళించింది. ఫిలింనగర్ సైట్-2 లో అచ్చం తిరుమల తరహాలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించిన శ్రీవారి ఆలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఆలయంలో బుధవారం మహా కుంభాభిషేకం వైభవోపేతంగా జరిగింది. మొదటి రోజే జంట నగరాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. రాజధానికి తలమానికంగా నిలవబోతున్న ఈ శ్రీవారి ఆలయంను మూడున్నర ఎకరాల విస్థిర్ణంలో భారతీయ శిల్పకళకు అద్దం పట్టేలా అద్భుత రాతి కట్టడంతో ఈ ఆధ్యాత్మిక ధామంను నిర్మించారు. తితిదే ఇది వరకు హిమయత్‌నగర్‌లో శ్రీవారి ఆలయంను నిర్మించగా ఇది రెండో ఆలయం.
విశేష పూజలు
బుధవారం తెల్లవారుజామున 2.30గంటల నుంచి 5.30 గంటల వరకు సుప్రభాతం, కుంభారాధన, నివేదన, హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. 5.30 నుంచి 6గంటల వరకు కుంభాలను, ఉత్సవమూర్తులను ఊరేగించారు. 6గంటల నుంచి 7.30 గంటల వరకు మీన లగ్నంలో ఆగమోక్తంగా మహా కుంభాభిషేకం చేపట్టారు. 7.30 గంటల నుంచి 9గంటల వరకు బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, ధ్వజారోహణం, అర్చక బహుమానం నిర్వహించారు. 9నుంచి 10.30గంటల వరకు నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఆ తరువాత భక్తులకు సర్వదర్శనం కల్పించారు. కాగా సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, 5.30గంటల నుంచి 6.30గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజారోహణం, 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు నిత్యకైంకర్యాలు, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 8.45 గంటలకు ఏకాంత సేవ నిర్వహించారు.
తరలివచ్చిన తితిదే బృందం
తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆలయంలో ఏర్పాట్లు బాగున్నాయని ఇంజినీరింగ్ అధికారులను అభినందించారు. తితిదే జేఈవో బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు ప్రాకారం, తిరునామం, శంఖుచక్రాలు, అర్చకుల నివాసాలు నిర్మించామన్నారు. వేడుకలో తితిదే జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపినాథ్ జెట్టి, ధర్మకర్తల మండలి సభ్యులు రుద్రరాజుపద్మరాజు, రమేష్‌బాబు, ప్రత్యేక ఆహ్వానితులు రాఘవేంద్రరావు, స్థానిక సలహామండలి అధ్యక్షులు బి.అశోక్‌రెడ్డి, సభ్యులు పి.రామకృష్ణ, పి.బాలరాజుగౌడ్, డి.కృష్ణమోహన్, వై.త్రినాథ్‌బాబు, రామిరెడ్డి, ఎస్‌ఈ ఎ.రాములు, డిప్యూటీ ఈవో పి.విశ్వనాథం, ఏఈవో జగన్‌మోహన్‌రాజు, తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు గురురాజారావు పాల్గొన్నారు.
ఆలయానికి ఇలా వెళ్లొచ్చు
సికింద్రాబాద్ నుంచి 47సి, 47ఎఫ్, 47ఎల్, 47వై, 47వైజీ, దిల్‌సుఖ్‌నగర్ బస్సు స్టేషన్ నుంచి 90డి/47వై, కోఠి బస్టాప్ నుంచి 127 ఎఫ్, సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 47వై/జి నంబర్ల ఆర్టీసీ బస్సులో ఫిలింనగర్ అపోలో హాస్పిటల్ బస్టాప్ వరకు వెళ్లి అక్కడి నుంచి ఆలయానికి నడకతో చేరుకోవచ్చు.
* కూకట్‌పల్లి నుంచి వచ్చే వారు అమీర్‌పేట, పంజాగుట్ట చౌరస్తాల నుంచి ఫిలింనగర్‌కు రాకపోకలు కొనసాగించే ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో సులువుగా చేరుకోవచ్చు.
* ఈసీఐఎల్ బస్టాప్ నుంచి 16హెచ్/47ఎల్, 17హెచ్‌ఎన్/47ఎల్ నంబర్ల బస్సుల నుంచి ఫిలింనగర్‌కు రావచ్చు. హైటెక్‌సిటీ, కొండాపూర్ తదితర ప్రాంతాల వాసులు 127 ఆర్టీసీ బస్సుల్లో ఫిలింనగర్‌కు అరగంట వ్యవధిలోనే చేరుకోవచ్చు.
* మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వారు పంజాగుట్ట చౌరస్తాకు చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో, లేదా ఆర్టీసీ బస్సుల్లో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు అక్కడి నుంచి ఫిలింనగర్ బస్టాప్‌కు చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి కాలినడకన ఐదు నిమిషాల వ్యవధిలో అపోలో ఆసుపత్రికి సమీపంలోనే ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ వేంకటేశ్వరస్వామి దేవస్థానం..
నూతన ఆలయ ప్రతిష్ఠ,మహాసంప్రోక్షణ కార్యక్రమంలో
టీటీడీ జేఈఓ బి.లక్ష్మీకాంతం గారు ._